‘రెడ్’ డిజిటల్ రిలీజ్ పై రామ్ క్లారిటీ

మార్చి, ఏప్రిల్ నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలపై కరోనా పిడుగు పడిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ మూతపడ్డాయి. లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుంది ? తిరిగి థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయ్ ?? అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓటీటీలో రిలీజ్ కాబోతుందనే ప్రచారం జరిగింది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదు. థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుందని ప్రకటన చేసింది. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ ‘రెడ్’ సినిమా కూడా డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై రామ్ అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

‘రామ్ డైలమాలో ఉన్నాడా ? ఎంత లేటైనా పర్లేదు అన్నా.. సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేయండి. థియేటర్స్‌లో వచ్చే వరకు మేం అదే ప్రేమతో, ఓపికతో ఉంటాం’ అని ట్విట్ చేశాడు. దీనిపై హీరో రామ్ స్పందించారు. ‘అతను డైలమాలో ఏ మాత్రం లేడు. వాస్తవానికి అతను ప్రభుత్వం చెప్పినట్టుగా సోషల్ డిస్టెన్సింగ్ , స్వీయ నిర్భంధంలో ఉన్నాడు. అతను కూడా తన ఫ్యాన్స్ అందరు రెడ్ సినిమాని బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని కోరుకుంటున్నాడు’ అని తన సమాధానం ఇచ్చారు. దీంతో రామ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వం రెడ్ తెరకెక్కుతోంది. తమిళ్ హిట్ ‘తడమ్’కి రిమేక్ ఇది.  శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తున్నారు.