కరోనా అనుమానితులకి జగన్ గిఫ్ట్
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్ కేంద్రంలో గడువు పూర్తయిన కరోనా అనుమానితులందరికీ రూ.2వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. బుధవారం సీఎం జగన్ కరోనాపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను అధికారులు జగన్కు వివరించారు.
ప్రస్తుతం రోజుకు 2100కుపైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని.. మరో నాలుగైదు రోజుల్లో పరీక్షల రోజువారీ సామర్థ్యాన్ని 4 వేలకు పెంచుతామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి కొన్ని సూచనలు చేశారు. క్వారంటైన్లో చికిత్స పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బాధితులకు వివరించాలన్నారు. వారికి రూ. 2వేల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు.