లోకేష్.. రూ. 5వేల డిమాండ్ !
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. క్వారంటైన్ పూర్తయిన వారికి రూ. 2వేలు ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. ఈ రకమైన సాయం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం లేదు. అయితే ఈ సాయంపై కూడా తెదేపా యువనేత నారా లోకేష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 4 రోజుల క్వారంటైన్ పూర్తయిన పేదలకు 2 వేల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. మరీ.. లాక్ డౌన్ కారణంగా 40 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్న పేదల పరిస్తితి ఏంటి ? అని ప్రశ్నించారు లోకేష్.
ఇప్పటికే 23 రోజులుగా పనులు లేక, అప్పు పుట్టక పేదలు ఇబ్బంది పడుతున్నారు. వారికి తక్షణమే 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు. అంతేకాదు.. కేంద్రం ప్రకటించిన సాయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించాలన్నారు. వైకాపా నాయకుల మాటల్లో తప్ప క్షేత్రస్థాయిలో రైతుకి గిట్టుబాటు ధర రావడం లేదని విమర్శించారు.
పేదలపై ఇంత ప్రేమ చూపిస్తున్న నారా లోకేష్ కరోనా విరాళంగా ఇచ్చింది రూ. 10లక్షలు. హెరిటేజ్ ఫ్రెష్ ఈ విరాళం ఇచ్చింది. అంతకుమించి వీరు ప్రజల్లో తిరిగింది లేదు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది లేదు.