పాండ్యాపై భజ్జీ గట్టి
టీ20 ప్రపంచకప్ లో చోటు సంపాదించాలని ఆశపడుతున్న ఆటగాళ్లు ఐపీఎల్ వాయిదాతో నిరాశలో మునిగిపోయారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో ఆడాలంటే పలువురు భారత క్రికెటర్లు ఐపీఎల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
ధోనీతో సహా హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు చాలా కాలంగా ఆటకు దూరమయ్యారు. దీంతో వీళ్లంతా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేయాలి. ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ఎవరెవరికి టీ20 వరల్డ్ కప్ లో చోటుదక్కనుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్‌తో సంబంధం లేకుండా ప్రపంచకప్ జట్టులో ఉంటాడని టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ పేర్కొన్నాడు. అందులో ఎలాంటి అనుమానం లేదని, కావాలంటే పేపర్‌మీద రాసిస్తానని నమ్మకంగా చెప్పాడు. టీమ్ఇండియాలో సరైన కూర్పు కావాలంటే పాండ్య కచ్చితంగా ఉండాలన్నాడు. గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమైనా అతడు తుది జట్టులో ఉంటాడని భజ్జీ ఆశాభావం వ్యక్తంచేశాడు.