రామ్ చరణ్ పాత్రలోకి మహేష్ ఎలా వచ్చాడంటే ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం అనుకొన్న పాత్రలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకొన్నారు. అయితే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటం వలన చేయలేకపోతున్నారు. దీంతో ఆ పాత్ర కోసం కొరటాల మహేశ్ ని ఒప్పించేశారు అని చెప్పుకొంటున్నారు.

తాజాగా ఓ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై దర్శకుడు కొరటాల క్లారిటీ ఇచ్చారు. ‘ఆచార్యలో ఒక బాధ్యతాయుతమైన పాత్ర ఉంది.  చరణ్ చేస్తే బాగుంటుందనుకున్నా. చిరంజీవి ఒప్పుకొన్నారు. రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు కాబట్టి దాన్నిబట్టి ప్లాన్ చేసుకుందామనుకున్నా. కానీ ఆ సినిమా వాయిదా పడింది. అయితే ఆ సమయంలో అనుకోకుండా మహేష్ బాబుతో మాట్లాడా. మాటల మధ్యలో సినిమా విడుదల ఎప్పుడు? అని అడిగారు. అదే స్పష్టత రావడం లేదండీ అన్నా. నా ఒత్తిడిని గమనించి  మరీ టెన్షన్ పరిస్థితి అనుకుంటే నేనున్నా అన్నారాయన. ఈ విషయాన్నిఒకరిద్దరితో పంచుకొన్నా. ఆ తర్వాత దీనిపై రకరకాల ప్రచారం జరిగింది’ అని చెప్పుకొచ్చారు.

మరీ ఫైనల్ గా ఆ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారా ? మహేష్ నా ? అని అడిగితే.. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకొనే సమయమా ? అని సమాధానాన్ని దాటేశారు కొరటాల.