కరోనాకు టీకా కనుగొంటున్నాం : కేంద్రం
వాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్ ని కట్టడి చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కరోనాకు టీకాని కనిపెట్టే ప్రయత్నంలో ఉంది. కరోనా వైరస్‌కు టీకా అభివృద్ధి చేయడంపైనే తాము దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన లవ్ అగర్వాల్.. కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీసీజీ, కన్వల్‌సెంట్ ప్లాస్మా థెరపి, మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో వైరస్‌ను జయించే వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. మే నెలలోగా సుమారు పది లక్షల ఆర్‌టీపీసీఆర్ కిట్లను తయారు చేయనున్నట్లు తెలిపారు. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1007 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 23 మంది మరణించారు.