కరోనా నరకం గురించి వివరించిన నటి
కరోనాతో పోరాడి గెలిచింది బాలీవుడ్ నటి జోయా మోరానీ. కరోనా బారినపడిన జోయా ఇటీవలే కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. డాక్టర్ల సూచనల మేరకు మరో 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటుంది. తాజాగా కరోనా లక్షణాలను గుర్తించినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే వరకూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె ఓ ఆంగ్ల పత్రికతో పాటు, ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
‘మార్చి 18 నుంచి నాలో కరోనావైరస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. సాధారణ జ్వరంగా ప్రారంభమై వారం అయ్యేసరికి తీవ్రమైన దగ్గు, తలనొప్పితో ఇబ్బందిపడ్డాను. కొన్నిరోజులయ్యే సరికి నాలోని రోగనిరోధక శక్తి పూర్తిగా దెబ్బతిందని అర్థమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే నేను చేసిన మొదటి పని.. నా కుటుంబసభ్యులకు దూరంగా ఓ గదిలో స్వీయ నిర్భందంలోకి వెళ్లాను. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కావాల్సిన.. తులసీ నీళ్లు, పసుపు కలిపిన పాలు, ఇలాగే ఇతర పానీయాలను ఎక్కువగా తీసుకున్నాను. ఇక ఆస్పత్రికి తరలించిన వెంటనే అక్కడి వైద్యులు నాలో ఆశావహ దృక్పథాన్ని పెంచడానికి ఎంతో ప్రయత్నించారు. కరోనా సోకితే అదో నరకం. దాని బారనపడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం’అని చెప్పుకొచ్చారు.