ధోని రీ-ఎంట్రీ అంత ఈజీ కాదు
కరోనా కారణంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జట్టులోకి రీ ఎంట్రీపై ఆశలు పెట్టుకున్న ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఈ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నారు. ధోని రీ ఎంట్రీ అంత ఈజీ కాదని మాజీలు అంటున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కూడా ఇదే మాట అన్నారు.
“జాతీయ జట్టు ఎంపికలో నువ్వెంత స్టార్ అనే విషయం సెకండరీ. ప్రస్తుతం నువ్వు ఎంతటి ఫామ్‌లో ఉన్నావ్ అనే అంశాన్ని మాత్రమే మొదటి చూస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత ధోని జట్టులోకి రావడం అంత ఈజీ కాదు. స్టార్ ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం. ఇక్కడ కావాల్సింది సాధారణ ప్రాక్టీస్ కాదని, మ్యాచ్‌ల్లో ప్రాక్టీస్ ఎలా ఉందనేదే చూస్తారు. ఇది ధోని కూడా తెలుసు. ధోని క్రికెట్ భవితవ్యంపై అతనికి క్లారిటీ ఉంటుంది. జాతీయ జట్టులోకి రావాలా.. వద్దా అనేది ధోని ఇష్టం. కానీ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరగాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు. ఈ లీగ్‌పై ఇప్పటివరకూ స్పష్టత లేదు. దాంతో ధోని మ్యాచ్ ప్రాక్టీస్‌లకు దూరమైనట్లే. ఇక్కడ ప్రాక్టీస్- మ్యాచ్ ప్రాక్టీస్ అనేవి రెండు వేర్వేరు అంశాలు” అని అజహర్ చెప్పుకొచ్చారు.