చైనా కరోనా లెక్కలు తప్పు : ట్రంప్
వుహాన్ లో కరోనా మరణాల సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ నగరంలో సంభవించిన మరణాలకు దాదాపు 50 శాతం అంటే 1,290 మరణాలను అదనంగా చేర్చారు. దీంతో చైనాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 40శాతం పెరిగి 4,632కు పెరిగింది.
ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. ‘కరోనా మరణాల సంఖ్యను చైనా ఒక్కసారిగా రెట్టింపు చేసింది. మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అమెరికా కంటే కూడా ఎక్కువే ఉంటుంది. మరణాల విషయంలో యూఎస్ వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లదు’ అన్నారు ట్రంప్.
కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి చైనాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అంటూ విమర్శలు చేశారు. చైనా వైరస్ విషయంలో అప్రమత్తం చేయడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.