వైకాపా రంగులతో రూ. 1400కోట్ల నష్టం

ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొదుపు మంత్రం జపించింది. ఇందుకోసం రివర్స్ టెండర్స్ ని చేపట్టింది. దాని వలన మిగిలిన మొత్తాన్ని లెక్కలు చూపి శభాష్ అనిపించుకుంది. ఇంత చేసిన వైకాపా.. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు పూసింది. ఇప్పుడీ వ్యవహారంపై పెద్ద దుమారం రేపుతోంది.
 
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోగా ప్రభుత్వ కార్యాలయాలపై వైకాపా పార్టీ రంగులని తొలగించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
“వైసీపీ రంగుల రాజకీయం పరాకాష్టకి చేరింది. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం అక్రమం అంటూ బీజేపీ ఎన్నోసార్లు హెచ్చరించినా సుమారు రూ. 1400 కోట్లు దుర్వినియోగం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు రంగులు మార్చడానికి ఎంత వృథా చేయనున్నారో? ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి” అంటూ కన్నా ట్విట్ చేశారు.