కేవలం 8 రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 20వేలు దాటాయి. సరిగ్గా 8 రోజుల్లో కేసులు 10వేల నుంచి రెట్టింపు అయ్యాయి. దేశంలో లాక్‌డౌన్ గత 30రోజులుగా కొనసాగుతోంది. అయినా కరోనా కంట్రోల్ కావడం లేదు. పైగా చాలా తక్కువ సమయంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఒకవేళ లాక్‌డౌన్ లేకుంటే.. పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో.. ఊహించుకోవచ్చు.

నెలరోజుల క్రితం (మార్చి 22న) జనతా కర్ఫ్యూ ద్వారా పౌర జీవన దిగ్బంధం మొదలైంది. ఆరోజు నాటికి 360 ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారానికి 20,471కి చేరింది. అంటే 5,686% వృద్ధి నమోదైంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 429 జిల్లాలకు ఈ మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.