అజిత్ అభిమానికి లారెన్స్ సాయం 

నృత్య దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ది గొప్ప మనసు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా లారెన్స్ బిల్లా 2 నటుడుని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అజిత్‌ ‘బిల్లా2’ చిత్రంలో నటించిన గణేషన్‌ అనే ఓ చిన్న ఆర్టిస్ట్.‌ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గణేషన్‌ ఇటీవల తన ఆర్థిక సమస్యల గురించి వివరిస్తూ ఓ వీడియోను రూపొందించి.. అజిత్‌ను సాయం కోరుతూ నెట్టింట్లో పోస్ట్‌ చేశాడు. తాజాగా ఆ వీడియో చూసిన లారెన్స్‌.. ట్విటర్‌ వేదికగా తనకి సాయం చేస్తానని మాట ఇచ్చారు.

‘హాయ్‌ బ్రదర్‌. ఇప్పుడే ఈ వీడియోను నా స్నేహితుడు నాకు షేర్‌ చేశాడు. ఈ వీడియోను నేను తప్పకుండా అజిత్‌ సర్‌ మేనేజర్‌కు పంపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక అజిత్‌ సర్‌ చూసినట్లు అయితే ఆయన తప్పకుండా నీకు సాయం చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంతో మంచి మనిషి. నీ చిన్నారుల చదువుల కోసం నా వంతు సాయం నేను కూడా చేస్తాను. మీకు సంబంధించిన వివరాలను పంపించండి’ అని లారెన్స్‌ పేర్కొన్నారు.