కరోనాపై భాజాపా అనుమానాలు నిజమేనా ?

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత నాలుగు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం 2, మంగళవారం 6, బుధవారం 2 మాత్రమే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. తెలంగాణలో కరోనా కంట్రోల్ కి వచ్చినట్టే. త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడబోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు నమ్ముతున్నారు. అయితే తెలంగాణ భాజాపా నేతలు నమ్మడం లేదు. పైగా కొత్త అనుమానాలువ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ భాజాపా కొత్త  అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కరోనాపై అనుమానాలున్నాయి అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులను దాచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం సంతోషకరమే అయినప్పటికీ ఒక్కసారిగా తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో పరీక్షలు ఎక్కువగా ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సూటిగా చెప్పాలంటే.. కరోనా నిర్థారణ పరీక్షలు తగ్గించడంతోనే కరోనా కేసులు తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు.