రూ. 500 వెనక్కి తీసుకోవడంపై గ్రామీణ బ్యాంకు వివరణ
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన పేద కుటుంబాలని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో రూ.500 నగదు జమచేసిన సంగతి తెలిసిందే. నెలకో రూ. 500 చొప్పున మూడు నెలల పాటుగా మొత్తం రూ. 1500 జమచేస్తామని తెలిపింది. ఇప్పటికే ఏప్రిల్ నెలకి సంబంధించిన రూ. 500 ఖాతాల్లో వేశారు.
అయితే ఈ డబ్బుని విత్ డ్రా చేసుకోకుంటే.. వెనకి వెళ్లిపోతున్నాయనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) యాజమాన్యం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోని 423 బ్యాంకు బ్రాంచిల్లో బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్స్ (బీఎస్‌బీడీ), జన్‌ధన్ ఖాతాలు మొత్తం 8,56,279 ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 2014 ఆగస్టు ఒకటో తేదీ తర్వాత ప్రారంభించిన జన్‌ధన్ ఖాతాలు 5,15,260 ఉండగా 2014 ఆగస్టుకు ముందు తెరచిన బీఎస్‌బీడీ ఖాతాలు 3,41,019 ఉన్నట్లు వివరించారు.
జన్‌ధన్ ఖాతాల నియమావళి ప్రకారం బీఎస్‌బీడీ ఖాతాలు పీఎంజీకేవై ప్యాకేజీ కింద మొత్తాలు పొందేందుకు అనర్హమైనవిగా పేర్కొన్నారు. ఇందువల్ల బీఎస్బీడీకి చెందిన 3,41,019 ఖతాల నుంచి రూ.17.05 కోట్లు వెనక్కి తెప్పించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 3,33,513 ఖాతాల నుంచి రూ.16,67,56,500 వెనక్కి తెప్పించినట్లు పేర్కొన్నారు. తాము బీఎస్‌బీడీ ఖాతాలు అనర్హమైనవిగా నిర్ధారించేలోపు 7,506 ఖాతాల నుంచి రూ.26.5లక్షలు మొత్తాన్ని ఖాతాదారులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.