కరోనా మానవ సృష్టి కాదు.. తేల్చిన అమెరికా నిఘా సంస్థ

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోన్న సంగంతి తెలిసిందే. ఈ వైరస్ ని చైనా కావాలానే సృష్టించిందా ? లేక వుహాన్ ప్రయోగశాల నుంచి ఈ వైరస్ బయటకు వచ్చిందా ? అన్నది తేల్చేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ దర్యాప్తు కొనసాగుతోంది.

కారక కరోనా వైరస్ మానవులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి. “కరోనా వైరస్ మానవ సృష్టి, జన్యు మార్పిడి ద్వారా వచ్చింది కాదని శాస్త్రవేత్తల్లో చాలా వరకూ ఏకాభిప్రాయం ఉంది. నిఘా సంస్థలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి వెలువడుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. ఇన్ ఫెక్షన్ సోకిన జంతువులకు దగ్గరగా మానవులు వెళ్లడం వల్ల ఈ వైరస్ వచ్చిందా లేక చైనాలోని వుహాన్ లో ఉన్న ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది దీని ద్వారా నిర్ధారిస్తాం” అని జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.