కమల్ హాసన్ పెద్ద తిండిబోతు
పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించే అతికొద్ది నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన కెరీర్ లో మరెవ్వరు నటించనన్నీ వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన కమల్.. నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు. ‘ఆహారం విషయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేను. నా తిండి గురించి, నాకంటే నాకు దగ్గరి వాళ్లు బాగా వివరిస్తారు. ఓసారి నేను తినే తిండి చూసి.. శివాజీ సర్ షాక్ అయ్యారు. గతంలో సరైన శరీరాకృతి కోసం రోజుకు 14 కిలో మీటర్లు పరిగెత్తేవాడిని. కానీ నాకు ప్రమాదం జరిగిన తర్వాత అంత దూరం పరిగెత్తలేకపోతున్నా’నని కమల్ తెలిపారు.
ప్రస్తుతం కమల్ ‘శభాష్ నాయుడు’, ‘భారతీయుడు 2’ సినిమాల్లో నటిస్తున్నారు.