వైన్స్ షాపుల వద్ద బారులు
లాక్‌డౌన్ 3.Oలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఉదయం దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మద్యం దుకాణాలు రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే 25 శాతం ధరలు పెంపుదల చేసిన ప్రభుత్వం.. వాటి పట్టికలను దుకాణాల వద్ద ఉంచాయి. నెల్లూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ తదితర జిల్లాల్లో మద్యం ప్రియులు దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలు చోట్ల భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.