కరోనాపై కేటీఆర్ మాట

మహమ్మారి కరోనా వైరస్ కి మందు లేదు. కరోనాకి వాక్సిన్ వచ్చేవరకు దానితో కలిసి జీవించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే అన్నారు. కరోనాపై వ్యాక్సిన్  లేదా ఔషధాన్ని కనుగొనేవరకు ప్రజలు వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. ఇక కరోనా ప్రభావం తగ్గాక మాత్రం భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచదేశాలు దృష్టి సారించే అవకాశాలున్నాయని కేటీఆర్ అన్నారు.

చైనా నుంచి తయారీ రంగాన్ని అందిపుచ్చుకోవడానికి భారత్ కు ఇది గొప్ప అవకాశం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఔషధ నగరి అంతర్జాతీయ ప్రయోజనాలకు ఉద్దేశించింది. వరంగల్ లోని కాకతీయ మెగా జౌళి పార్కుకూ అంతే ప్రాధాన్యం ఉంది. ఔషధ నగరికి 900 మెగావాట్ల విద్యుత్ కోసం రూ. రెండువేల కోట్లను వెచ్చించాలి. నీటి అవసరాలకు మరో రూ. రెండువేల కోట్లు అవసరం. పారిశ్రామిక కారిడార్లలో స్వయంప్రతిపత్తి గల టౌన్ షిప్ లతో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశానని తెలిపారు. ఇక తెలంగాణలో కరోనా నుంచి కోలుకునే రేటు.. సంక్రమణ రేటు కన్నా ఎక్కువగా ఉందన్నారు.