తెలంగాణలో మందుబాబులకి నిరాశ

లాక్‌డౌన్ 3.‌Oలో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణలో మద్యం షాపులు తెరచుకోలేదు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణలో రెండో విడత లాక్‌డౌన్ మే 7 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. అది పూర్తయ్యాకే.. ఆరేంజ్, గ్రీన్ జోన్లలో మద్యం షాపులకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీలోనూ మందుబాబులకు షాక్ తగిలింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో అమ్మకాలకు ఓకే చెప్పినప్పటికీ.. మద్యం ధరలు 25 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలో మద్యం షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల అర కి. మీ మేర లైన్ కట్టారు. ఈ సందర్భంగా నిబంధనలని పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.