పవన్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే కాంబినేషన్స్ లో పవన్-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. టాలీవుడ్ కి అత్తారింటికి వందకోట్ల దారిని చూపించింది. రిలీజ్ కి ముందే సగం సినిమా బయటికొచ్చినా.. సత్తాచాటింది. పవన్ క్రేజ్ ఏంటన్నది రుజువు చేసింది. ఇక వీరి హ్యాట్రిక్ చిత్రం అజ్ఝాతవాసి తేడా కొట్టేసింది. అట్టర్ ప్లాప్ అయింది.

పవన్ అభిమానులకి ఓ పీడకలలా మిగిలింది. కాపీ కథ అంటూ త్రివిక్రమ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. అజ్ఝాతవాసి తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా సెట్ అవ్వలేదు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? పవన్ సినిమాకి త్రివిక్రమ్ కథ-మాటలు అందించబోతున్నారట. గోపాల గోపాల దర్శకుడు డాలీ పవర్ స్టార్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కథ, మాటలు రెడీ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో తీన్ మార్ సినిమాకు ఇదే తరహాలో పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి స్నేహితుడు పవన్ కోసం త్రివిక్రమ్ మాటల బలం చూపించబోతున్నారు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత డాలీ సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.