ఆ టైమ్ లో ధోని ఒత్తిడికి లోనవుతాడట
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఒత్తిడికి లోనవుతారంటే.. నమ్ముతారా ? కానీ నిజంగానే ధోని ఒత్తిడికి లోనవుతుంటారట. ఆ విషయాన్ని స్వయంగా ధోనినే తెలిపారు. మైండ్ కండీషనింగ్ కార్యక్రమాల కోసం టీమ్ఇండియా మాజీ ఆటగాడు బద్రీనాథ్, శరవణ కుమార్ సంయుక్తంగా స్థాపించిన ఎంఫోర్ సంస్థ కోసం ధోనీ గురువారం మాట్లాడాడు.
“నేను బ్యాటింగ్కు దిగినప్పుడు తొలి 5-10 బంతులను ఎదుర్కొనే సమయంలో నా గుండె కొట్టుకునే వేగం అనూహ్యంగా పెరిగిపోతుంటుంది. మానసిక సంబంధమైన సమస్యలను కోచ్తో పంచుకునేందుకు ఆటగాళ్లు వెనుకాడుతారు. అందుకే ఏ క్రీడలో అయినా ప్లేయర్లకు, కోచ్కు మధ్య బంధం చాలా ముఖ్యం. అందుకే మెంటల్ కండీషనింగ్ కోచ్ 15రోజులకు ఒకసారి వచ్చి కేవలం జట్టు అనుభవాలను తెలుసుకునేందుకే పరిమితం కాకూడదు. ఒకవేళ ఆ కోచ్ నిరంతరం ప్లేయర్లతో ఉంటే.. క్రీడలో ఏ విషయాలు ఆటగాళ్లపై ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోగలడు” అని ధోనీ అభిప్రాయపడ్డారు.