సినిమా దారి మార్చుకుంది : రాజమౌళి


కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమలో భారీ మార్పులు రానున్నాయి. కరోనాకి ముందు, తర్వాత అన్నట్టుగా సినిమా పరిశ్రమలో మార్పులొస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ మీడియా ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. భవిష్యత్ ఓటీటీ లదే అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోదర్శకనిర్మాతలు ఎలాంటి మార్పులు చేయాలి అనే అంశం గురించి ఓ వెబినార్‌ జరిగింది. అందులో దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఆ వెబినార్‌లో మన తెలుగు పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌ బాబు, యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి.. “కరోనా లాక్‌డౌన్‌ తర్వాత సినిమా పరిశ్రమలో మార్పులు ఉంటాయనిపిస్తోంది. సినిమాను నదితో పోలిస్తే… ప్రస్తుతం సినిమా దారి మార్చుకుంది. దానికి తగ్గట్టే దర్శకులు కూడా కథల విషయంలో మార్పు చూపించాలి. ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారబోతోంది. మూస ధోరణిలో వెళ్తే బోల్తా పడతాం. ఇప్పటికిప్పుడు థియేటర్ల ఓపెన్‌ చేస్తే సినిమాలు చూడటానికి జనాలు వస్తారా లేదా అనేది చూడాలి. థియేటర్‌కు రావడానికి ప్రేక్షకుడు జంకొచ్చు. ప్రేక్షకుడు థియేటర్ కి రావడానికి.. 6 నెలలైనా పట్టొచ్చు, లేక సంవత్సరమైనా పట్టొచ్చు. ఈ లోపు ప్రజలు ఆన్‌లైన్‌ కంటెంట్‌కి ఇంకా ఎక్కువగా అలవాటు పడతారు. అప్పుడు మనం వాటికి మించి అలరించేలా మన సినిమాలను మార్చుకోవాలి. ఓటీటీకి మించిన కంటెంట్ ని తీసుకురావాలి” అన్నారు.