మీరే నా ఎనర్జీ.. నా ప్రాణం !
అభిమానులే నా సంతోషం.. నా ఎనర్జీ.. నా ప్రాణం.. అంతకు మించి నా బాధ్యత అన్నారు ఎనర్జిటిక్ హీరో రామ్. ఈ నెల 15 (మే15)న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులని ఓ రిక్వెస్ట్ చేశాడు రామ్. ఈ సారి తన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండండి. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, కాబట్టి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని ఆయన కోరారు.
“నా ప్రియమైన అభిమానులకు.. మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా మే 15న నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరే నా సంతోషం.. నా ఎనర్జీ.. నా ప్రాణం.. అంతకు మించి నా బాధ్యత..! ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల రీత్యా ఈ సారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం..! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను” అని రామ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం రామ్ ‘రెడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ నటిస్తున్న రెడ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
To my ❤️s.. #StayHomeStaySafe – Stay Strong!
Love..#RAPO pic.twitter.com/wTmlievzxN
— RAm POthineni (@ramsayz) May 12, 2020