పది పరీక్షలు రద్దు.. నేరుగా ఇంటర్ లోకి అనుమతి !
కరోనా లాక్‌డౌన్ తో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అసలే పరీక్షల సమయం కావడంతో.. అవన్నీ కూడా వాయిదా పడ్డాయి. అయితే మూడో విడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్, తదితర పరీక్షలని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. అయితే ఛత్తీస్ గడ్ ప్రభుత్వం మాత్రం పది, ఇంటర్ పరీక్షలని మొత్తానికే క్యాన్సిల్ చేస్తున్నాం. విద్యార్థులని నేరుగా పై తరగతులకి ప్రమోట్ చేస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని భావించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం కూడా దగ్గర పడుతోందని అందుకే ఛతీస్ గడ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పదో తరగతి, మిగిలిపోయిన ఇంటర్ పరీక్షలని నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయనున్నారు. ప్రతిరోజు రెండు పరీక్షలు.. ఉదయం, మధ్యాహ్నం చొప్పున నిర్వహించనున్నారు. ఒక్కో తరగతి గదికి 15 నుంచి 20 లోపు విద్యార్థులని మాత్రమే కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించాలనే ప్రయత్నాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నాయి.