తెలుగు రాష్ట్రాలపై అంపన్ తుఫాన్ ఎఫెక్ట్ ఎంత ?

అంపన్ పెను తుపానుగా మారింది. గడచిన ఆరు గంటల్లో 14 కి. మీ వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ఇది ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ దిశగా 570 కి.మీ, పశ్చిమ బంగాలోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి రేపు మధ్యాహ్నం బంగాల్-బంగ్లాదేశ్ తీరంలోని హతియా దీవుల వద్ద తీరం దాటే సూచనలు ఉన్నట్టు అధికారులు వివరించారు.

తీరం దాటే సమయంలో అత్యంత తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, గంటకు 165 నుంచి 195 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉబ్బార, మాయపట్నం, సూరాడపేట, కోనపపుపేటలో రాకాసి అలలు గృహాలపై  విరుచుకు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ అంపన్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తెలంగాణలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి.