ఆ రెండు దేశాల్లో కరోనా విజృంభణ

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య బుధవారంతో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటింది. అందులో 15 లక్షలకుపైగా బాధితులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఇప్పటివరకు 3.26 లక్షల మందికిపైగా ప్రాణాలను బలిగొంది. అందులో 90 వేలకుపైగా మరణాలు అమెరికాలోనే సంభవించాయి.

ప్రస్తుతం చైనా, అమెరికాతోపాటు ఐరోపావ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే- రష్యా, బ్రెజిల్ తదితర దేశాల్లో దాని ఉద్ధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో కేసుల సంఖ్య తాజాగా మూడు లక్షలు దాటింది. 2వేల 972 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా రష్యా నిలిచింది.

అమెరికాతో పోల్చితే కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా… కేసులు మాత్రం విజృంభిస్తున్నాయి. ప్రతి రోజు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్ లో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో 1,179 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. బ్రెజిల్ లో మొత్తం కేసుల సంఖ్య 2.75 లక్షలు దాటింది. మొత్తంగా కరోనా నుంచి స్పెయిన్, ఇటలీ కోలుకుంటుంటే.. రష్యా, బ్రెజిల్ లో మహమ్మారి విజృంభిస్తోంది.