ప్రయివేటు పాఠశాలలో షిఫ్టుల విధానం
కరోనా ఎఫెక్ట్ తో పాఠశాలల వాతావరణం మారనుంది. మునుపటి సందడి కనిపించదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటిస్తూ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి.
యూనిసెఫ్, ప్రముఖ సంఘాలు ఇప్పటికే రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పలు సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ బోర్డు పరిధిలోని పాఠశాలలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి. సాధారణంగా తరగతి గదిలో 30-40 మంది విద్యార్థులు ఉంటారు. భౌతిక దూరం పాటించాలంటే షిఫ్టు విధానం అమలు చేయాలి. అంటే సగం మంది ఒక రోజు బడికి వస్తే మిగిలిన వారు ఇంటి వద్ద ఒకటీ రెండు పీరియడ్లు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావాలి. లేదంటే తరగతిని రెండు సెక్షన్లు చేసి నిర్వహించాలి.
ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్, కాలితో పెడల్ ను తొక్కితే చేతిలో శానిటైజరు పడేలా పరికరాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా పాఠశాలలో విద్యార్థులకి వినోదం మిస్ కానుంది. అభద్రతా భావం, కరోనా భయంతో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.