ఏపీలో రోడెక్కిన బస్సులు
ఎట్టకేలకు ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్ డౌన్ కారణంగా గత 58 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే నాల్గో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆర్టీసీ బస్సులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్& సర్వీసులు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.
నిన్న సాయంత్రం నుంచే ఆన్ లైన్ బుకింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు (17 శాతం) నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. ఈ ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.