షూటింగ్’లకి అనుమతి.. బాధ్యత మెగాస్టార్ పైనే !

కరోనా లాక్ డౌన్ షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి.. సిసిసి సంస్థని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా విరాళాలు సేకరించి సినీ కార్మికులని ఆదుకున్నారు చిరు. అయితే ఇది సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి శాశ్వత పరిష్కారం కాదు. వారికి పని కల్పించాలి. షూటింగ్స్ మొదలవుతేనే వారికి పని దొరుకుతోంది. ఇప్పుడు ఆ బాధ్యతని కూడా చిరంజీవిపైనే పెట్టారు.

మూడు, నాల్గో లాక్ డౌన్ సడలింపులతో అన్నీ రంగాలకి ఊరట లభిస్తోంది. తిరిగి అన్నీ తెరచుకుంటున్నాయి. అయితే సినీ పరిశ్రమకి మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఇప్పట్లో థియేటర్లకి అనుమతులు లభించే పరిస్థితి లేదు. అందుకే చిత్రసీమ కనీసం చిత్రీకరణలనైనా మొదలు పెట్టాలనే ప్రయత్నంలో ఉంది. చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అవి పునః ప్రారంభమైతేనే కార్మికులకి ఉపాధితో పాటు చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, నటులు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు సమావేశం కానున్నారు. ఒక నిర్ణయానికొచ్చాక పరిశ్రమ తరఫున ప్రభుత్వాల్ని సంప్రదించే యోచనలో ఉన్నట్టు సమాచారమ్. ఆ ప్రయత్నాలు ఫలిస్తే.. జూన్ రెండో వారం నుంచి తిరిగి షూటింగ్స్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.