బస్తీ దవాఖానాలు ప్రారంభించిన కేటీఆర్
నాణ్యమైన ప్రాథమిక వైద్యం కోసమే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్, యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలు అండగా నిలుస్తాయన్నారు. ఒక్కో బస్తీ దవాఖానాలో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు అందుబాటులో ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందించనున్నారు. బస్తీ దవాఖానాల్లో 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించడమే కాకుండా 150 రకాల మందులను ఉచితంగా అందించనున్నారు.