సినిమా షూటింగ్’లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలుగు సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్. షూటింగ్ లకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ రంగంపై ఆధారపడినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సినీ కార్మికుల బాధలు వర్ణనాతీతం. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన సిసిసి సంస్థ కష్ట కాలంలో సినీ కార్మికులకి అండగా నిలిచింది. లేదంటే వారి పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే కొన్నాళ్లు షూటింగ్స్ అనుమతి కోసం సినీ ప్రముఖులు చేస్తున్నప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 

గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ తో సమావేశమైన సినీ ప్రముఖులు ఈరోజు సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు.  గతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.  సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని తెలిపారు.

ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని కోరారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ల నిర్వహణపై రేపు, లేదా ఎల్లుండి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ నుంచి గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి. ఇక భవిష్యత్ లో పరిస్థితిని బట్టి థియేటర్స్ కు అనుమతినిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.