కేసీఆర్ కి కృతజ్ఝతలు తెలిపిన మెగాస్టార్
ప్రగతి భవన్ లో శుక్రవారం సీఎం కేసీఆర్ సినీ ప్రముఖులతో సమావేశం అయ్యారు. కేసీఆర్‌తో సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు.
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం కేసీఆర్ దృష్టికి వారు తీసుకొచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరగా, జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణలు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో సీఎం కేసీఆర్ కి మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. “సీఎం కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు.. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.” అని ట్వీట్ చేశారు.