అందుకే భారత్ లో కరోనా మరణాలు తక్కువ

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉండగా, భారత్‌లో అది 2.8 శాతంగా ఉంది. లాక్‌డౌన్, వెంటనే కేసులు గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం వల్ల మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్‌ అగర్వాల్ తెలిపారు.

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. అలాగే వ్యాక్సిన్‌ వచ్చే వరకు కరోనాకు తగ్గట్టుగా ప్రవర్తించాలన్నారు. ఇప్పటివరకు వైరస్‌ను కట్టడి చేయగలిగామని, కానీ కరోనా మీద పోరు మాత్రం పూర్తి కాలేదన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 6,535 కేసులు నమోదు కాగా, మంగళవారం నాటికి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరిందని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది. వారిలో 60,490 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4,167 మంది మరణించారు.