‘నమస్తే ట్రంప్’ వల్లే కరోనా విజృంభణ

కరోనా మహమ్మారిపై రాజకీయాలు మొదలయ్యాయ్. మంగళవారం మీడియా ముందుకొచ్చిన కాంగ్రెస్ యువనేత లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం విఫలమైందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక గుజరాత్‌లో 800కు పైగా చావులకు బీజేపీనే కారణమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసింది. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, మరణాలు పెరిగిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా ఆరోపించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో వేల మంది పాల్గొన్నారు. అనంతరం మొతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరయ్యారు. ఇక గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15వేలకి చేరువైంది.  మరో 888 మంది మృతి చెందారు. నమస్తే ట్రంప్ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.