ఆన్ లైన్ లో మహానాడు.. ఓ రికార్డ్ !
అమరావతిలో పసుపు పండగ ప్రారంభం అయింది. తెదేపా పెద్ద పండగలా భావించే ‘మహానాడు’ కార్యక్రమాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్ఆర్ ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా భాగస్వాములయ్యారు. యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్ లైన్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. కరోనా ఎఫెక్ట్ తో డిజిటల్ మీడియా ప్రాధాన్యం మరింతగా పెరనుందనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడా మాటలని నిజం చేస్తూ.. ఆన్ లైన్ లో మహానాడు రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.
ఇక మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు.. కార్యకర్తలకి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం జగన్ యేడాది పాలనని ఎండగట్టాలని పిలుపునివ్వనున్నారు. సీఎం జగన్ యేడాది పాలన అభివృద్దిలో సున్నా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాని తెదేపా భావిస్తోంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. తెదేపా మహానాడుని ఆన్ లైన్ లోనూ మహాపండగలా నిర్వహించడం గొప్ప విషయమే.