కేసీఆర్ తీపి కబురుపై ఉత్తమ్ కామెంట్

త్వరలోనే రైతులకి తీపి కబురు చెబుతాం. అది దేశానికి సప్రైజ్ ఇచ్చేలా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. దీంతో.. సీఎం కేసీఆర్ చెప్పబోయే తీపి కబురు కోసం తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ చెప్పబోయే తీపి కబురు ఏం ఉంటుంది ? అంటూ గ్రామాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

మరోవైపు సీఎం కేసీఆర్ తీపి కబురు పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని.. స్థానిక సంస్థలను తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రైతుబంధు ఇవ్వడం లేదు.. రుణ మాఫీ చేయడం లేదు.. ఇవేమీ చేయకుండా రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో పంటల సాగు జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా ఒక్క ఎకరానికైనా నీరు అందిందా?ఎస్సారెస్పీ కింద పండిన పంటలనే కాళేశ్వరం కింద చూపిస్తున్నారని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.