భారత్ కు కొత్త వైరస్ ముప్పు
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు, అభివృద్ది చెందిన దేశాలు సైతం కుదేలవుతున్నాయ్. ఇక పేద దేశాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఎప్పుడు భయటపడుతుంది ? అన్నది స్పష్టత లేని విషయం. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు.. కరోనా విజృంభణ కొనసాగుతుండగానే సరికొత్త వైరస్ బయటపడింది. ఎబోలా వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది.
కరోనా లాగానే ఎబోలా కూడా డేంజర్ వైరస్ నే. ఆఫ్రికన్ దేశమైన కాంగోలో తాజాగా ఎబోలా వైరస్ బయటపడింది. దేశంలోని వంగాటా ప్రావిన్స్‌లో ఆరు ఎబోలా కేసులు గుర్తించామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ వ్యాధి లక్షణాలతో ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. వైరస్ బారిన పడినవారి శారీరక స్రావాలను నేరుగా తాకితే వ్యాధి సంక్రమిస్తుంది. ప్రస్తుతానికి మన దేశంలో ఆ వైరస్ లేదు. కానీ భవిష్యత్‌లో మన దేశంలోకి వచ్చే ప్రమాదాలు లేకపోదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎబోలా లక్షణాలు :
* ఎబోలా వైరస్ సోకినవారిలో లక్షణాలు కనిపించేందుకు కనీసం సుమారు 21 రోజుల సమయం తీసుకుంటుంది
* 101 డిగ్రీల జ్వరం ఉంటుంది
* తలనొప్పి విపరీతంగా ఉండటంతో పాటు కండరాలు, కీళ్ల నొప్పులుంటాయి
* పొత్తికడుపులో కూడా బాగా నొప్పి వస్తుంది
* నీరసంగా మారి బలహీనంగా ఉంటారు
* గొంతువాపు, తలతిరగడం, వాంతి వచ్చేట్లు అనిపించడం
* అంతర్గత రక్తస్రావం, రక్తపువాంతులు, రక్తవిరేచనాలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి