ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ కేసు.. ఢిల్లీకి బదిలీ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ మీరా చోప్రా పెట్టిన కేసుపై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఎనిమిది ట్విటర్‌ అకౌంట్ల నుంచే మీరా చోఫ్రాకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఇందులో గణేష్‌, ఎన్‌టీఆర్‌భీమ్‌99 వంటి అకౌంట్లు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఐటీ యాక్ట్‌ 67, 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, తాజాగా ’67ఎ’ సెక్షన్‌ను జత చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె దిల్లీలో ఉంటున్నందున ఈ కేసును అక్కడికే బదిలీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇటీవల మీరా చోప్రా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ ఛాట్ చేస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ గురించి చెప్పమని ఆయన అభిమాని ఒకరు అడిగారు. ‘నాకు ఆయన గురించి తెలియదు. నేను ఆయన అభిమానిని కాదు.. మహేశ్‌ బాబు అంటే ఎక్కువ ఇష్టం’ అన్నందుకు మీరా చోప్రాను అసభ్యపదజాలంతో దూషిస్తూ, ట్విటర్‌ వేదికగా దుమ్మెత్తిపోశారు. దీంతో ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయస్థాయికి వెళ్లింది. జాతీయమహిళా కమిషన్ స్పందించింది. హీరోయిన్ మీరా చోప్రాకు మద్దతుగా ఉంటామని తెలిపింది. మరోవైపు, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు తారక్ స్పందించనే లేదు.