ధోనికి తొలి అవకాశం ఎలా వచ్చిందంటే ?
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గొప్ప ఆటగాడు అన్నది అందరికీ తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదిగి టీమ్ఇండియాను అగ్రపథంలో నడిపించాడు. తన నాయకత్వంలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి మరే ఇతర కెప్టెన్‌కూ సాధ్యంకాని ఘనత అందుకున్నాడు. అంత గొప్ప ఆటగాడికి తొలి అవకాశం ఇచ్చింది ఎవరు? అతడిని గుర్తించింది ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పారు భారతజట్టు మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్ సయద్ కిర్మాణి.
ధోనికి తొలి అవకాశం ఇచ్చింది తానేనని కిర్మాణి తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో అన్నారు. నేనూ, ప్రణబ్ ఒకసారి రంజీ మ్యాచ్ చూస్తున్నాం. ప్రణబ్ అప్పుడు నాతో ఒక మాట చెప్పాడు. ‘ఈ మ్యాచ్‌లో ఒక ఆటగాడున్నాడు. కీపింగ్, బ్యాటింగ్ బాగా చేయగలడు. కచ్చితంగా ఈస్ట్‌జోన్‌కు ఎంపికయ్యే అర్హతలున్నాయి’ అని నాతో అన్నాడు. దాంతో నేను ‘ఇప్పుడు కీపింగ్ చేస్తున్నాడా’ అని అడిగాను. అతను కాదని, ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడని చెప్పాడు. అప్పుడే ధోనీ గణంకాలు తెప్పించుకొని పరిశీలించాను. బ్యాటింగ్‌లో అతని నిలకడ చూసి ఆశ్చర్యపోయా. తర్వాత ధోనీ కీపింగ్ కూడా చూడకుండానే అతను ఈస్ట్‌జోన్‌కు ఆడనున్నాడని చెప్పాను. ఆ తర్వాత మొత్తం చరిత్ర గురించి తెలిసిందేనన్నాడు.