ఆడియో టేపు లీకుపై ఖుష్బూ ఫైర్

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఆడియో టేపు ఒకటి ఆన్ లైన్ లో లీకైంది. వైరల్ అయింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో త్వరలో బుల్లితెర, వెండితెర షూటింగ్స్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఖుష్బూ ఇటీవల ఓ ఆడియో పెట్టారు.

‘ప్రస్తుతం మీడియా వాళ్లకి కరోనా గురించి కాకుండా రాయడానికి ఏం లేదు. షూటింగ్స్‌ ప్రారంభం కాగానే వాళ్ల దృష్టి మనపైన పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు, వీడియోలకు అనుమతి ఇవ్వకండి’ అని ఖుష్బూ మాట్లాడింది. ఈ ఆడియో బయటకు లీక్‌ కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై ఖుష్భూ నిర్మాతల మండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీరు ఎవరి కోసం పనిచేస్తారో వాళ్లే మీ వెనుక గోతులు తవ్వుతున్నారని తెలిస్తే ఎంతో బాధాకరంగా ఉంటుంది. నా ఆడియో టేప్‌ని ఏ నిర్మాత బయటకు లీక్‌ చేశారో నాకు తెలుసు. కానీ వాళ్ల పేరు నేను బయటపెట్టను. నా నిశ్శబ్దం, క్షమాగుణమే వారికి అతిపెద్ద శిక్ష’ అని ఖుష్బూ ట్విట్ చేశారు.