కరోనాతో ఎమ్మెల్యే మృతి

కరోనా మహమ్మారికి ప్రజాప్రతినిధి బలయ్యాడు. డీఎంకే ఎమ్మెల్యే జె. అన్బళగన్ కరోనావైరస్ కారణంగా బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ నెల 2న అన్బళగన్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఎమ్మెల్యేకి కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తూ వచ్చారు. అయితే సోమవారం నుంచి ఆయన ఆరోగ్యం విషమించి.. ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దేశంలో కరోనాతో చనిపోయిన మొదటి ప్రజాప్రతినిధి అన్బళగన్ నే.

కరుణానిధికి సన్నిహితుడైన అన్బళగన్ చెన్నైలోని చెపాక్ – ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తమిళనాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం అన్బళగన్ 62వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు నాడే కన్నుమూయడం విషాదకరం. కరోనా ఆంక్షల కారణంగా అన్బళగన్ కుటుంబ సభ్యులు కూడా ఆయనను కలవలేకపోయారు. అన్బళగన్ కు ముందు నుంచే రక్తపోటు ఉంది. కొన్ని సంవత్సరాల కిందట కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. దీంతో ఆయన కరోనా నుంచి కోలుకోలేకపోయారని తెలిసింది.