అక్కడ 30 సెకన్ల వరకు నో మాస్క్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మాస్క్ ని ధరించడం తప్పనిసరి చేసింది. అయితే బ్యాంకులు, నగల దుకాణాలకు వచ్చేవారు 30 సెకన్లపాటు మాస్కును తొలగించాల్సిందిగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బ్యాంకులు, నగల దుకాణాల్లోని సీసీ కెమెరాల్లో సందర్శకుల ముఖాలు సీసీ టీవీల్లో రికార్డయ్యేందుకు వీలుగా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

దాదాపు రెండు నెలల కఠిన లాక్‌డౌన్ అనంతరం సడలింపులు ఇవ్వడంతో బ్యాంకులు, ఆభరణాల దుకాణాలను సందర్శించేవారి సంఖ్య పెరుగుతుండటంతో వారిని గుర్తించేందుకే ఈ కొత్త నిబంధనలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేసింది. ఇక మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపు 10వేల కరోనా కేసులు నమోదయ్యారు. కరోనా కాటుకు 400 మంది బలయ్యారు.