మరోసారి పూర్తి లాక్‌డౌన్.. ఎందుకు అమలు చేయకూడదు ?


దేశంలో కరోనా కట్టడి కోసం విడతలవారీగా లాక్‌డౌన్ ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఐదో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే మూడో విడత లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇస్తూ వస్తోంది. ఐదో విడత లాక్‌డౌన్ లో భారీగా సడలింపులు ఇచ్చేశారు. దాదాపు అన్నీ తెరచుకుంటున్నాయి. పూర్తి లాక్‌డౌన్ కొనసాగిస్తే ఆర్థికరంగం ఇంకా కుదేలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే దేశంలో కరోనా చావుల కంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని.. కేంద్రం ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే లాక్‌డౌన్ సడలింపులతో దేశంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు కరోనా మరణాలు వందలకుపైగా నమోదవుతున్నాయ్.

ఈ నేపథ్యంలోనే దేశంలో మరోసారి పూర్తి లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అది సరైన నిర్ణయమని మెజారిటీ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని అధికారవర్గాల నుంచి సమాచారమ్ వస్తోంది. తాజాగా మద్రాస్ హైకోర్టు మరోసారి పూర్తి  లాక్‌డౌన్ ని ఎందుకు అమలు చేయకూడదు ? అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటేలా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ప్రజావాజ్యంపై స్పందించిన కోర్టు.. మరోసారి పూర్తి  లాక్‌డౌన్ ని ఎందుకు అమలు చేయకూడని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరడంతో..విచారణ వాయిదా పడింది.