కాంగ్రెస్ సీనియర్లు హౌస్‌ అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లందరినీ హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు. అలాగని ఇది కరోనా క్వారంటైన్ కాదు. అధిక కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్‌ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వి.హనుమంతరావులని గృహ నిర్భంధం చేశారు. తమని అరెస్ట్ చేయడంపై ఎంపీ కోమట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించి అద్దెకూడా చెల్లించవద్దన్నారు.. ఇప్పుడు స్లాబుల పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు.