అచ్చెన్నాయుడి అరెస్ట్ పై ఏసీబీ వివరణ
ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టయ్యారు. ఈరోజు ఉదయం 7.30గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తెదేపా శ్రేణులు భగ్గుమంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి ముందు కుట్రపూరితంగా అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. అసలు అచ్చెన్నాయుడుని ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ స్పందించింది.
“ఈఎస్ఐలో ప్రధానంగా మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటమ్స్, ఫర్నిచర్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయి. మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ బంధువుల పేర్లమీద నకిలీ కొటేషన్లతో మార్కెట్ ధర కంటే 50 నుంచి 130 శాతం అధిక ధరలకు కోట్ చేశారు. ఈ-టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.988 కోట్లు కేటాయిస్తే .. అందులో రూ.150 కోట్ల వరకు అవినీతి జరిగింది. మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్, డాక్టర్ విజయ్‌కుమార్, అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరి పాత్ర ఇందులో ఉందని ఏసీబీ దర్యాప్తులో తేలింది. దర్యాప్తు బృందాలు ఈరోజు ఉదయం 7.30గంటలకు నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశాయి. రమేశ్‌కుమార్‌ను తిరుపతిలో, విజయకుమార్‌ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం” అని ఏసీబీ అధికారులు తెలిపారు.