కరోనా కేసుల్లో 4వ స్థానంలోకి భారత్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా కేసుల జాబితాలో భారత్ 4వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 2,92,000 పాజిటివ్‌ కేసులతో నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను తాజాగా భారత్‌ దాటేసింది. ప్రపంచంలో 20లక్షల కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 8లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 5లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇక గడచిన 24గంటల్లో భారత్ లో 10,956 పాజిటివ్‌ కేసులు బయటపడడంతోపాటు 396మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడిననుంచి ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2,97,535 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 8498మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.