కేసీఆర్ రంగంలోకి దిగారు
తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 200పైగా ఉంటుంది. వీటిలో 90శాతంపైగా కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, చికిత్స, పరీక్షలకు ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నందున అక్కడ విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 30 నియోజకవర్గా్ల పరిధిలో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 10 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, చుట్టుపక్కన 4 జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు.