తెదేపా డ్రెస్ కోడ్ మారనుంది

ఏపీ అసెంబ్లీ పసుపు చొక్కాలతో కళకళలాడేది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం పాలవ్వడంతో ఏపీ అసెంబ్లీలో పసుపు చొక్కాల సంఖ్య బాగా తగ్గింది. తెదేపాకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు ఇప్పటికే గోడ దూకారు. వైసీపీలో చేరారు. మిగిలిన పసుపు చొక్కాల కలర్ కూడా ఇప్పుడు మారనుంది.  రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకి పసుపు చొక్కాలకి బదులుగా బ్లాక్ చొక్కాలని వేసుకురావాలని తెదేపా నిర్ణయించింది.

మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయ్. ఈ నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా? వద్దా?.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఫైనల్ గా అసెంబ్లీ సమవేశాలని వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాదు.. తెలుగుదేశం నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నల్ల చొక్కాలతో వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెదేపా డ్రెస్ కోడ్ మారనుందనే కామెంట్స్ వినబడుతున్నాయి.