ఏంపీ రఘురామ కృష్ణంరాజుపై ఎటాక్
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ రెబల్ గా మారారు. ‘కుల రాజకీయాలు చేయొద్దని, మా చిన్న కులంలో చిచ్చుపెట్టొద్దని ఆ కోటరీ సభ్యులను కోరుతున్నా’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి వెంటనే రియాక్షన్ రాలేదు. అయితే మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి వైకాపా నేతలు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఎంపీ రఘురాజు వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటనే మీడియా ముందుకొచ్చి రఘురామరాజుని కడిగేశారు.
మంత్రి రంగనాథరాజు పశ్చిమ గోదావరి వైకాపా నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైకాపాలో అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం అందరం కొవిడ్-19పై పోరాడుతున్నాం. నరసాపురం నియోజకవర్గంలో ఏడు రెడ్ జోన్లు ఉన్నాయి. ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడుతుంటే ఎమ్మెల్యేలందరూ క్షేత్రస్థాయి వెళ్లి ప్రజల అవసరాల గురించి ఆరా తీస్తున్నారు. సీఎం సహాయనిధికి డబ్బులు వసూలు చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించడం తగదు. మరి నియోజకవర్గంలో ప్రజల విషయాలను ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలందరూ సమర్థంగా పనిచేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు మీరే పెడుతున్నారని విమర్శించారు.