ఐపీఎల్’కు లైన్ క్లియర్

టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్.. ఈ రెండు టోర్నీలు జరగడం అసాధ్యం. అయితే ఇందులో ఒకటి రద్దయినా మరొకటి జరిగే అవకాశాలున్నాయ్. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం జులై నుంచి 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమితిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఆసీస్‌లో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌ను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తారని భావించారంతా. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎర్ల్ ఎడ్డింగ్స్‌ టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం అసాధ్యం అన్నారు. దీంతో ఐపీఎల్ కి లైన్ క్లియర్ అయినటేనని భావిస్తున్నారు.  

”కరోనా వైరస్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాదు. చాలా దేశాలు ఇప్పటికీ మహమ్మారితో పోరాడుతుండగా మెగాటోర్నీలో పాల్గొనే 16 దేశాలు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించడం అసాధ్యం లేదా ఎంతో కష్టమనిపిస్తోంది” అని ఎర్ల్‌ ఎడ్డింగ్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. అయితే టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐకి ఇది కలిసొస్తుంది. ఒకవేళ ఐపీఎల్ రద్దయితే.. బీసీసీఐకి రూ. 4వేల కోట్ల నష్టం కలుగనుందని తెలుస్తోంది.